Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లింగసముద్రం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో లింగసముద్రం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన వివిధ గ్రామాల ప్రజలు, తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మొత్తం 110 అర్జీలు రాగా, శాసనసభ్యుల వారు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రజల సమస్యలను సావధానంగా విన్నారు. చిన్న చిన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అక్కడున్న అధికారులకు సూచనలు ఇచ్చారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గం మొత్తం మీద, లింగసముద్రం మండలంలోనే రెవెన్యూ సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రజాదర్బార్ లో వాటి గురించి అర్జీలే ఎక్కువగా వచ్చాయి. ఒకే స్థలాన్ని ఇద్దరు ముగ్గురికి పట్టా ఇచ్చారు. అలాగే భూమి మీద ఒకరు ఉంటే, రికార్డుల్లో వేరొకరి పేరు కనిపిస్తోంది. గతంలో పని చేసిన రెవెన్యూ అధికారుల కారణంగానే ఈ సమస్యలు వచ్చాయి. గత వైసిపి ప్రభుత్వం నిర్వహించిన రీ సర్వే మొత్తం తప్పులు తడక హడావుడి సర్వే వల్లే అనేక కొత్త సమస్యలు పుట్టుకొచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ తప్పులన్నీ సరి చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది. ఒక్కొక్క సమస్యను లోతుగా పరిశీలించాలి. భూమిపై ఉన్న వారి పేర్లు మాత్రమే ఆన్ లైన్ లో కనిపించాలి. వీలైనంత త్వరగా ఈ సమస్యలు పరిష్కరించాలని అధికారులు ఆదేశిస్తున్నాను. ఇంకా మిగిలిన సమస్యల పైన కూడా అర్జీలు వచ్చాయి. దరఖాస్తు దారులను పదేపదే ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా, అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజా దర్బార్ కార్యక్రమంలో వస్తున్న అర్జీలను ముఖ్యమంత్రి పోర్టల్ లో అప్లోడ్ చేయబోతున్నాం. ఆ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు నిరంతరం పర్యవేక్షణ చేస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పోలీస్ అధికారి వి.బాలసుబ్రమణ్యం ఎమ్మార్వో కోటేశ్వరరావు, ఎంపీడీవో కె .శ్రీనివాసరావు, మరియు అన్ని శాఖల అధికారులు మరియు లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం, లింగసముద్రం గ్రామ పార్టీ అధ్యక్షుడు గాలంకి ప్రసాద్, పార్టీ నాయకులు వంకాయలపాటి మాల్యాద్రి, అడపా రంగయ్య, సోంపల్లి మనోహర్, మద్దెల రామారావు, పూరిమెట్ల మాల్యాద్రి అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi