Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జిల్లాలో అన్ని రకాల సహకార సంఘాలను పటిష్ట పరచి వాటి బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజలకు మంచి సేవలు అందించుటకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నాల్గవ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు బ్యాంకుల తరహాలో రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లాలో సహకార సంఘాల ఆధునీకరణ, డిజిటలైజేషన్‌కు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆప్కాబ్ సహకారంతో జిల్లాలోని 78 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలోని రికార్డులు కంప్యూటరీకరణ పూర్తిదశకు వచ్చిందన్నారు. పిఎసిఎస్‌ల కంప్యూటరీకరణ వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, ఆన్‌లైన్ సేవలకు, కోర్ బ్యాంకింగ్ సేవలకు అనుసంధానించబడి సభ్యులకు సత్వర సేవలు అందుతాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో నెల్లూరు డిసిసి బ్యాంకు, ప్రకాశం జిల్లా డిసిసి బ్యాంకునకు అనుసంధానించబడిన 61 పిఎసిఎస్ సంఘాలలో క్రియాశీలక సభ్యుల రుణాలు, డిపాజిట్లు, భూమి వివరాలు 87.99శాతం కంప్యూటరీకరణ పూర్తి అయినట్లు చెప్పారు. ప్రపంచ వికేంద్రీకత ఆహార భద్రతా పథకం కింద పడుగుపాడు పిఎసిఎస్‌కు అతిపెద్ద ధాన్యం నిల్వ కేంద్రం మంజూరైనట్లు, ఈ కేంద్రం ద్వారా బహుళ ప్రయోజన సేవలు రైతులకు లభించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. నాబార్డు సహకారంతో జిల్లాలో కొత్తగా బహుళ ప్రయోజన పిఎసిఎస్ సంఘాలు, మత్స్యకారుల సంఘాలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు స్థాపించుటకు జాయింట్ కలెక్టరు అధ్యక్షతన జాయింట్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో సహకార సంఘాల బలోపేతానికి కమిటీ సభ్యులు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సహకారశాఖ అధికారి గుర్రప్ప, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ అధికారి రమేష్‌నాయక్,నాబార్డ్ AGM తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi